పిల్లల డిజిటల్‌ భద్రతకు ప్రభుత్వం పూర్తి అండ-సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: డిజిటల్‌ వేదికలపై పిల్లలు ఎదుర్కొంటున్న ఆన్‌లైన్‌ వేధింపులు, సైబర్‌ నేరాలను అరికట్టి వారికి సురక్షిత వాతావరణం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పిల్లల రక్షణ కోసం న్యాయ సేవల ప్రాధికార సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలను రాష్ట్రంలోని ప్రతి గ్రామానికీ విస్తరించేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు.


జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో శనివారం ‘డిజిటల్‌ వేదికలపై పిల్లలకు రక్షణ, సులభంగా న్యాయం అందించడం: ఆన్‌లైన్‌ లైంగిక వేధింపుల నివారణ, పిల్లలకు అనుకూలమైన న్యాయ వ్యవస్థ బలోపేతం’ అనే అంశంపై దక్షిణాది ప్రాంతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహిళలు, పిల్లల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.


ఒకేచోట అన్ని రకాల సహాయం


మహిళలు, పిల్లల రక్షణ కోసం రాష్ట్రంలో పోలీసులు, భరోసా కేంద్రాలు, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ యూనిట్లు, బాలల సంక్షేమ కమిటీలు, ప్రత్యేక న్యాయస్థానాలు, న్యాయ సేవా సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ముఖ్యమంత్రి వివరించారు. భరోసా కేంద్రాల్లో బాధితులకు ఒకేచోట పోలీసు సహాయం, వైద్య సేవలు, న్యాయ సహాయం, కౌన్సెలింగ్‌ అందిస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే తొలి బాలల అనుకూల న్యాయస్థానాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.


పోలీసు శాఖ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో షీ-భరోసా సైబర్‌ ల్యాబ్‌లు పనిచేస్తున్నాయని, సైబర్‌ భద్రతపై విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించేందుకు సైబర్‌ యాప్‌ను వినియోగిస్తున్నామని చెప్పారు. విద్యార్థులనే సైబర్‌ అంబాసిడర్లుగా తీర్చిదిద్ది తోటి విద్యార్థులకు ఆన్‌లైన్‌ భద్రతపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు.


మూడు వేల మందికి శిక్షణ


బాధిత పిల్లలకు ఆర్థిక సహాయంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశం కల్పించడం వంటి చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ, పాఠశాల విద్యాశాఖ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులకు చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు మూడు వేల మందికి పైగా బాలల రక్షణ అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు.


సైబర్‌ నేరాల నియంత్రణలో తల్లిదండ్రులను కూడా భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పిల్లలు ఆన్‌లైన్‌ వేధింపులకు గురైనప్పుడు వారిని తప్పుబట్టకుండా, వారి సమస్యలను అర్థం చేసుకుని అండగా నిలవాలని కోరారు. సైబర్‌ నేరాల ఫిర్యాదుల కోసం 1930, బాలల సహాయం కోసం 1098 హెల్ప్‌లైన్‌ నంబర్లను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు.


బాధితుడి జీవితాన్ని నిలబెట్టడమే నిజమైన న్యాయం


న్యాయం అంటే కేవలం నేరస్తుడికి శిక్ష విధించడం మాత్రమే కాదని, బాధితుడి జీవితాన్ని తిరిగి నిలబెట్టి, కోల్పోయిన గౌరవాన్ని పునరుద్ధరించడమని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా పిల్లలు కోల్పోయిన బాల్యాన్ని తిరిగి అందించడమే నిజమైన న్యాయమని వ్యాఖ్యానించారు. ఈ సదస్సులో జరిగే చర్చలు, సూచనలు, సిఫారసులు దేశవ్యాప్తంగా బాలల రక్షణ వ్యవస్థల బలోపేతానికి మార్గదర్శకంగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.


ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ పి.ఎస్‌. నరసింహ, జస్టిస్‌ ఆర్‌. మహదేవన్‌, జస్టిస్‌ అలోక్‌ అరాధే, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌, పలు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఉచిత న్యాయ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రూపొందించిన సంచార లోక్‌ అదాలత్‌ వాహనాలను ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, న్యాయమూర్తులు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ న్యాయ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో ఈ వాహనాలు ఉపయోగపడనున్నాయి.

author

Srinivas reddy Kalagiri

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE